భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు - శాఖలు, పోస్టులు ఇలా..!!
ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్దం అవుతున్నారు. ఏకంగా 56 వేల ఉద్యోగల భర్తీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీల వివరాలను అన్ని శాఖలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించాయి. తొలి విడతలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో,ఇప్పుడు ప్రభుత్వం జారీ చేయనున్న నోటిఫికేషన్ల పైన నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.
భారీగా ఉద్యోగాల భర్తీ
రేవంత్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. శాఖల వారీగా ఖాళీలను గుర్తించింది. ఇప్పటికే ప్రధాన శాఖలు లెక్కలు అందించాయి. 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా లెక్కలతో స్పష్టం అవుతోంది. వీటిలో 14,236 అంగన్‌వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్-1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితోపాటు గ్రూప్-2, 3, 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భ ర్తీకిగాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

జాబ్ క్యాలెండర్
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుని 2024-25 జాబ్ క్యాలెండర్‌ను రూపొందించింది. కాగా, ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తి కావటంతో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
శాఖల వారీగా
శాఖల వారీగా ఖాళీల భర్తీ పై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుళ్లు, 1,650 వరకు ఎస్‌ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. వైద్యారోగ్య శాఖలో సుమారు 6వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లో కలిపి దాదాపు 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్‌అండ్‌బీలో 185-200 వరకు పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్‌లు, 7,837 హెల్పర్‌లు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
ఎక్కడ ఎన్ని పోస్టులు
గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారి నుంచిదాదాపు 6వేల మంది వీఆర్వోలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించన్నారు. మిగిలిన 4వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. పోలీసు శాఖ 12,150, వైద్యశాఖ 2,762, ఆర్టీసీ 3,038, గురుకులాలు 2,850, ఇంజనీరింగ్ 2,510, వ్యవసాయ శాఖ 148, ఆర్‌అండ్‌బీ 185, రెవెన్యూ 10,954, మహిళా శిశుసంక్షేమం 14,236, గ్రూప్ -1 లోనూ ఖాళీల భర్తీ పైన కసరత్తు కొనసాగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపిందనే చర్చ సర్వత్రా మొదలైంది. దీంతో ఏపీలో కూడా ఆ ఒత్తిడి పడుతుందేమో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications