టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై బంపర్ ఆఫర్
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రతి దసరా, సంక్రాంతి పండగ సీజన్‌లల్లో దీన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో మరో ఆఫర్‌ను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం.
అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన హైదరాబాద్- విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి శుభవార్తను వినిపించింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సు సర్వీసుల్లో ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సు సర్వీసుల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులకు ఛార్జీలో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 30వ తేదీ వరకు రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఎప్పుడు ప్రయాణించినా, దానికి అవసరమైన టికెట్లను అడ్వాన్స్డ్‌గా బుక్ చేసుకున్నా టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సందర్శించాలని యాజమాన్యం సూచించింది.
అక్టోబర్ నెలలో దసరా పండగ రానున్న నేపథ్యంలో ఇదే రాయితీని అన్ని సర్వీసులకూ వర్తింపజేసే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని దసరా పండగ సీజన్ ఆరంభమైన తరువాత అధికారికంగా ప్రకటించవచ్చని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఆఫర్‌ను అమలు చేయడం వల్ల టీజీఎస్ఆర్టీసీ అదనపు ఆదాయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications