రాఖీ పౌర్ణమి సందర్భంగా 5 వేల ప్రత్యేక బస్సులు.. టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 27 నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే మరో 240 బస్సులు అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాఖీ పండుగ వేళ మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. రద్దీ ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టుగా అదనపు సర్వీసులు పెంచామని.. ఈ మేరకు ఆర్టీసీ సిబ్బంది, యాజమాన్యానికి ప్రజలు సహకరించాలని అన్నారు.
ఆగస్టు 26 మిలాద్ ఉన్ నబీ, ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి అలాగే ఆగస్టు 30 ఆదివారం కావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక తిరుగు ప్రయాణాల రద్దీ ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం అదనంగా బస్సు సర్వీసులను పెంచామని తెలిపారు. ఈ మేరకు ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. ఇక మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకంలో ఎలాంటి మార్పు ఉండదని ఆ పథకం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సొంతూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించేలా టీజీఎస్ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని కోరుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వం.. అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు అనుబంధం అజరామరం.. రాఖీ బంధన్ భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ వేడుక అని అన్నారు. ప్రజలంతా సౌభ్రాతృత్వంతో జీవించడంతోనే వసుదైక కుటుంబ భావన పరిఢవిల్లుతుంది.. అని కేసీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications