టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రూ. 160 వరకు తగ్గింపు: రూట్ ఇదే
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. గతంలో రాఖీ పండగ నాడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులను అందజేసింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. ప్రతి దసరా, సంక్రాంతి పండగ సీజన్‌లల్లో దీన్ని అమలు చేయనుంది.
అదే సమయంలో మరో ఆఫర్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. ప్రయాణ ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే అన్ని రకాల టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య వివిధ రకాల బస్ సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి.

సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్- బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. జహీరాబాద్, వరంగల్, ఖమ్మం, మియాపూర్, పికెట్, నిజామాబాద్ వంటి డిపోల నుంచ మొత్తం 24కు పైగా సర్వీసులు ఈ రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణికులకు సేవలను అందిస్తోన్నాయి.
ఆయా బస్సులన్నింట్లో ప్రయాణ ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఒక్కో టికెట్ మీద 100 నుంచి 160 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. https://www.tgsrtcbus.in వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
1. ఈ 10 శాతం డిస్కౌంట్ వల్ల ఏసీ స్లీపర్ (బెర్త్) ప్రస్తుత ఛార్జీ- రూ. 1,569 నుంచి 1,412 రూపాయలకు తగ్గుతుంది.
2. ఏసీ స్లీపర్-సీటర్ ప్రస్తుత ఛార్జీ- రూ. 1,203 నుంచి 1,083 రూపాయలకు తగ్గుతుంది.
3. రాజధాని ప్రస్తుత ఛార్జీ- రూ. 1,203 నుంచి 1,083 రూపాయలకు తగ్గుతుంది.
4. నాన్ ఏసీ స్టీపర్ (బెర్త్) ప్రస్తుత ఛార్జీ- రూ. 1,160 నుంచి 1,044 రూపాయలకు తగ్గుతుంది.
5. నాన్ ఏసీ సీటర్ ప్రస్తుత ఛార్జీ- రూ. 951 నుంచి 856 రూపాయలకు తగ్గుతుంది.
6. సూపర్ లగ్జరీ ప్రస్తుత ఛార్జీ- రూ. 946 నుంచి 851 రూపాయలకు తగ్గుతుంది.












Click it and Unblock the Notifications