టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్- ప్రయాణికులకు కొత్త సదుపాయం
TGSRTC: పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జిల్లాలకూ వాటిని విస్తరింపజేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు మార్గాల్లో ఎలక్ట్రిక్ నాన్ ఏసీ/ఏసీ సిటీ బస్సులు పరుగులు పెడుతోన్నాయి.
ఇప్పుడు తాజాగా కరీంనగర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో 35 బస్సులు రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు- నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

41 సీట్ల సామర్థ్యం ఉన్న సూపర్ లగ్జరీ బస్సులు ఇవి. దూర ప్రాంతాల మధ్య నడిపించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీగా వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా ప్రయాణించగలదు. రెండు నుంచి మూడు గంటల వ్యవధిలో ఈ బస్సులు వందశాతం మేర ఛార్జ్ అవుతాయి.
ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారీ బస్సుల్లో. డ్రైవర్ క్యాబిన్ సహా గ్యాంగ్‌వేలో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క ఛార్జింగ్‌లో 325 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించే అవకాశం ఉన్నందున హైదరాబాద్ సహా వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు ఈ బస్సులను నడిపించవచ్చు.

సాధారణ సూపర్ లగ్జరీ బస్సులతో సమానంగా గ్యాంగ్‌వే, లగేజీ స్పేస్, డ్రైవర్ క్యాబిన్, అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, లగ్జరీ సీటింగ్, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉన్నాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని ఆరు నెలల వరకు అక్కడే స్టోర్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications