Crop Loan Waiver: రైతు రుణ మాఫీ చేయాలని బీజేపీ పోరు బాట..!
రాష్ట్రంలో రుణ మాఫీ కాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పారని విమర్శించారు. రుణ మాఫీ చేయమంటే.. దిక్కులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డితో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే 6 గ్యారంటీలు ఇచ్చారని ఈటల గుర్తు చేశారు. రేవంత్ అయితే రుణాలు లేని రైతులు వెంటనే బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకోవాలని చెప్పినట్లు రాజేందర్ గుర్తు చేశారు.
కొంత మంది రైతులకు రుణ మాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రైతు రుణ మాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు మద్దతుగా రైతు దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ దీక్ష కొనసాగుతోందని వివరించారు. ఈ ఇందిరా పార్కు వద్ద జరిగి రైతు దీక్షకు పెద్ద ఎత్తున రైతులు వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.

అబద్దాలే జీవితంగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు. రైతు ఏడుపు ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఘట్ కేసరిలో 1206 మంది రైతులు రుణం తీసుకుంటే ఇంకా 1006 మందికి రుణమాఫీ కాలేదని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంఓ నుంచి 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ప్రకటన వచ్చిందని.. దాని లెక్కలు లేవని ఈటల అన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు బీజేపీ ముందుంటుందని తెలిపారు.
రైతు రుణ మాఫీ ప్రభుత్వం రైతులు, ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటికే చలో ప్రజాభవన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా అన్నదాతల కోసం పోరుబాట పట్టడంతో ప్రభుత్వం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతులు రుణ మాఫీ కాక బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం నాలుగో విడత రుణ మాఫీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిధులు సమకూర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications