కాకతీయుల కాలంనాటి భద్రకాళీ చెరువుకు గండి!
భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టారు. కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువు అయిన భద్రకాళీ చెరువు నిండు కుండలా తలపిస్తున్న ఈ సమయంలో అధికారులు గండి కొట్టి నీటిని నాగారం చెరువుకు మళ్ళిస్తున్నారు. అసలు అధికారులు ఎందుకు భద్రకాళీ చెరువుకు గండి కొట్టారు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
భద్రకాళీ చెరువు ప్రక్షాళన
భద్రకాళీ చెరువును ప్రక్షాళన చెయ్యాలని, చెరువు పూడికతీత పనులు నిర్వహించాలని భావించిన సర్కార్ ఆదేశాలతో అధికారులు భద్రకాళీ చెరువును ఖాళీ చేసే క్రమంలో భద్రకాళీ చెరువుకు గండి కొట్టారు. పూడికతీత పనులకు ముందస్తు చర్యలలో భాగంగా ప్రస్తుతం చెరువులో ఉన్న నీటిని మత్తడి ద్వారా ప్రతిరోజు విడుదల చేస్తున్నారు.

భద్రకాళీ చెరువుకు గండి
ఈ మేరకు నిన్న అధికారులు గండి కొట్టారు. భద్రకాళి చెరువు నీరు నగరంలోని కాల్వ ద్వారా హసన్పర్తి మండలం నాగారంలోని పెద్దచెరువుకు చేరేలా హన్మకొండ కాపువాడ నుండి అలంకార్ మీదుగా కాలువలోకి వెళ్ళేలా గండి కొట్టారు. ఒకవేళ నాగారం చెరువు భద్రకాళి చెరువు నుండి వచ్చే నీటితో నిండినట్లయితే ఇప్పటివరకు ఏ విధంగానైతే మత్తడి నుండి కింది ప్రాంతానికి వాగు ద్వారా నీరు వెళ్తుందో అలాగే వెళ్లేలా చర్యలు చేపట్టారు.
ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా నీటిని దిగువకు పంపుతున్న అధిఆరులు
ప్రజలకు, రైతులకు, పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నీటి ప్రవాహం సాఫీగా ఉండేటట్టు సాగునీటిపారుదల శాఖ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. కల్వర్టుల వద్ద, కాల్వలలో చెత్త చెదారం, ఇతర ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. భద్రకాళి చెరువు నీటిని పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ పరిమాణంలో గండి కొట్టి విడుదల మొదలుపెట్టారు.
15 రోజుల్లోగా భద్రకాళీ చెరువు ఖాళీ
10-15 రోజుల్లో భద్రకాళి చెరువులోని నీటిని పూర్తిస్థాయిలో తీసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అధికారులు . భద్రకాళి చెరువులో పూడిక తీయడం వలన నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, చెరువు నీరు వ్యర్ధాల తొలగింపుతో ఫ్రెష్ గా కూడా ఉంటుందని భావిస్తున్నారు . భద్రకాళి చెరువు పూడికతీయడం వలన రానున్న రోజుల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని కూడా భావిస్తున్నారు.
ఆపై పూడికతీత పనులు
చెరువు నీటిని తీసేసిన అనంతరం పూడికతీత పనులు మొదలుపెట్టనున్నారు. చెరువు పూడికతీత అనంతరం రానున్న రోజుల్లో బొంది వాగు ప్రాంతం నుండి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు అధికారులు. మురుగునీటి విషయంలో ఎస్ టి పి ప్లాన్ కోసం మంత్రులు ఆదేశాలు ఇవ్వగా, ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications