నగరంలో నేటితో పూర్తైన తొలి విడత ఫీవర్ సర్వే.!సర్వే సత్ఫలితాలిచ్చిందన్న జిహెచ్ఎంసి అధికారలు.!
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వే నేటితో పూర్తవుతుందని, వెంటనే తిరిగి రెండవ విడత సర్వే ప్రారంభిస్తామని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు 2,68,000 మందికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ద్వారా జ్వర పరీక్షలు చేశామని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ వివరించారు. జ్వరంతో ఉన్న వారికి ఉచితంగా మెడికల్ కిట్ లను అందచేశామని పేర్కొన్నారు. నగరంలో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వే నేటితో పూర్తవుతున్నందున వెంటనే రెండో రౌండ్ సర్వేను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 11 ప్రధాన ఆసుపత్రులను శుభ్ర పరిచి, లైటింగ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

Recommended Video
హైదరాబాద్ లో ఆక్సిజన్ కు ఏ విధమైన కొరత లేదని, ప్రస్తుతం 5800 సిలిండర్లు అందుబాటులో ఉండగా కేవలం 5000 ఆక్సిజన్ సిలిండర్లు మాత్రమే సరిపోతున్నాయని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 720 , మేడ్చల్ జిల్లాలో 435 బృందాలతో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని తెలియచేసారు. జీహెచ్ఎంసీ సహకారంతో అన్ని ముఖ్య ఆసుపత్రులను పరిశుభ్ర పరిచి తగు లైటింగ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని, ఉదయం 10 గంటల అనంతరం అనుమతి పొందిన వారు మినహా మరెవ్వరూ వీధుల్లో ఉండరాదని ముఖ్యమంత్రి నగర సీపి కి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రులను పరిశుభ్రపరిచి పూర్తిస్థాయిలో లైటింగ్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసారు.












Click it and Unblock the Notifications