దేశపు మొట్టమొదటి రోబోటిక్స్ సమ్మిట్; హైదరాబాద్ ను విశ్వనగరంగా చేసే పనిలో కేటీఆర్!!
తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దటంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, టెక్నాలజీలో దూసుకుపోయేలా చేస్తున్న కేటీఆర్ హైదరాబాద్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా విభిన్న సదస్సులను నిర్వహించడానికి వేదికగా మారుస్తున్నారు.
దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్లో నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కేటీఆర్, మరో అంతర్జాతీయ సదస్సుతో రికార్డు సృష్టించబోతున్నారు. హైదరాబాద్ వైపు ప్రపంచం దృష్టి ఆకర్షించే ఏ చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు. ఈ క్రమంలోనే ఆల్-ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం జూలై 21, 22 తేదీల్లో హైదరాబాదులో గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్ నిర్వహించనున్నాయి.

ఈ కార్యక్రమానికి 25 దేశాలనుండి పెట్టుబడిదారులు శాస్త్రవేత్తలు మరియు ఇతర పర్యావరణ వ్యవస్థ సంబంధించిన ప్రముఖులు హాజరు కానున్నారు. హైటెక్ సిటీ లోని నోవాటెల్ హోటల్లో ఈ సమ్మిట్ జరగనుంది. నోవాటెల్ లోని హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన నిపుణులు ఈ సదస్సుకు హాజరు అవుతారు.
పారిశ్రామికవేత్తలకు ఒక వేదికను ఏర్పాటు చేయడమే గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని తెలుస్తుంది. ఈ సదస్సులో వివిధ అంశాలలో రోబోటిక్స్ పాత్రపై ప్రముఖంగా చర్చిస్తారు. రోబోటిక్స్ అభివృద్ధి కోసం చెయ్యవలసిన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్ చైర్మన్ పిఎస్వి కిషన్ స్పష్టం చేశారు. రోబోటిక్స్, ఆటోమేషన్ రంగంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకటనకు హైదరాబాద్ వేదికగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వడం వల్ల హైదరాబాద్ కు అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమ్మిట్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి రోబోలను తయారు చేయడంలో రాష్ట్రానికి ఉపయోగపడే ఇన్నోవేషన్ ఎకో సిస్టం ను ప్రోత్సహిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ ఖ్యాతిని మరోసారి చాటేలాగా, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలాగా ఈ సదస్సును నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications