Telangana: పోలింగ్ రోజు కోడిగుడ్డు కర్రీ, పెరుగు, సాంబారు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. ఇటు ఎన్నికల సంఘం ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యారెట్ ద్వారా ఓటు వేశారు.
వారంతా రేపు ఈవీఎం పంపిణీ కేంద్రాలకు వెళ్తారు. పోలీసులు కూడా ఎన్నికల బందోబస్తుకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఎవరు ఎన్నికల బందోబస్తులో పాల్గొనాలో వారికి సందేశాలు వెళ్లాయి. వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్ లో పోలీసులు భద్రతను చూసుకోనున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, పోలీసులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎండ కాలం కావడంతో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మంచి ఆహారం అందించాలని సూచించింది. సిబ్బంది ఆదివారం సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్తారు. వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకోగానే.. మజ్జిగ, సమోసా ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు నిమ్మరసం లేదా మజ్జిగ ఇవ్వనున్నారు. రాత్రి భోజనం 7 నుంచి 8 గంటల మధ్యలో అందివ్వనున్నారు.
రాత్రి భోజనంలో అన్నం, కర్రీ, చపాతీ, టమాటా పప్పు, పెరుగు ఇస్తారు. సోమవారం అంటే 13న ఉదయం టీ, రెండు అరటి పండ్లు ఇవ్వనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఉప్మా ఇస్తారు. అందులో పల్లీల చట్నీ అందిస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య మజ్జిగ ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్న భోజనం ఇస్తారు.
మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు కర్రీ, సాంబారు, పెరుగు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నిమ్మ రసం లేదా మజ్జిగ ఇస్తారు. సాయింత్రం టీతో పాటు బిస్కెట్లు ఇవ్వనున్నారు. ఇదంతా పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ, వారు గ్రామాల్లో అయితే గ్రామపంచాయితీ వారు చూసుకుంటారు.












Click it and Unblock the Notifications