బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక పిటీషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం..!!
సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దక్కింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో పిటీషన్లు పెండింగ్ లో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరణతో సుప్రీంకు వచ్చామని పిటీషనర్ వివరించారు. అక్కడ స్టే ఇస్తే ఇక్కడకు వస్తారా అంటూ కోర్టు ప్రశ్నించింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా.. విచారణ చేయలేమని సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను తిరస్కరించింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్ల పైన సుప్రీం విచారణ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ దవే వాదించారు. వారితో ఈ కేసు పైన సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ని తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమం లోనే సుప్రీం విచారణ.. నిర్ణయం పైన రాజకీయంగానూ ఉత్కంఠ పెరిగింది.
సుప్రీం విచారణ వేళ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. సుప్రీంలో విచారణ సమయంలో స్వయంగా కోర్టుకు మంత్రులు హాజరయ్యారు. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు కాగా.. దానిపై ఈ నెల 8న విచారణ జరగనుంది.
రిజర్వేషన్లు 50 శాతానికి మించ కూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో.. చట్ట విరుద్దం అంటూ పిటిషన్‌దారు పేర్కొన్న నేపథ్యంలో సుప్రీం విచారణ పైన ఉత్కంఠ పెరిగింది. కాగా.. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటీషన్ తిరస్కరణ.. ఈ నెల 8న హైకోర్టులో విచారణ తరువాత ఈ జీవో పైన తెలంగాణ హైకోర్టు నిర్ణయం కీలకం కానుంది. ఆ తరువాతనే రిజర్వేషన్లు.. ఎన్నికల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications