Telangana: రైల్వేలోనూ తెలంగాణకు అన్యాయమే..!
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు రైల్వే కేటాయింపుల్లోనూ తెలంగాణ అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు రైల్వే కేటాయింపులకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ లకు అభివృద్ధికి రూ.5,336 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.32,946 కోట్లు విలువైన 20 ప్రాజెక్టుల కింద 2,298 కిలో మీటర్ల కొత్త ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు.
యూపీఏ హయాంలో ఏడాదికి 17 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగిందని.. కానీ ఇప్పుడు సంవత్సరానికి 65 కిలో మీటర్ల మేర పనులు కొనసాగుతోన్నాయని వివరించారు. ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించి తెలంగాణలో 100 శాతం ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు. అమృత్ స్టేషన్స్ పథకంలో భాగంగా 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించినట్లు పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 437 ఫ్లే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు పూర్తి చేసినట్లు వివరించారు. అయితే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.5,071 కోట్లు కేటాయించారు. ఇప్పుడుదానికి రూ.265 కోట్లు మాత్రమే యాడ్ చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రైల్వే కేటాయింపులు చూసినట్లయితే. ఏపీకి ఈ బడ్జెట్ లో రూ.9,151 కోట్లు కేటాయించారు. తెలంగాణ కంటే దాదాపు రూ.4 వేల కోట్లు ఎక్కువగా కేటాయించారు. అంతే కాదు తెలంగాణలో రూ.32 వేల కోట్ల పనులు జరుగుతుంటే.. ఏపీలో రూ.73 వేల కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. దీన్ని బట్టే కేంద్రం వివక్ష అర్థం అవుతుందని తెలంగాణ వాదులు చెబుతున్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను గెలిపించినా.. తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. దీనిపై బీజేపీ ఎంపీలు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ఏడాదికి 151 కిలో మీటర్ల కొత్త ట్రాక్ ల నిర్మాణం, 195 కిలో మీటర్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిఫికేషన్ పనులు వంద శాతం పూర్తయినట్లు వివరించారు. అమృత్ స్కీమ్ కింద 73 స్టేషన్లను ఆధునికీకరించామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విజయవాడ - ఎరుపాలెం నుంచి అమరావతికి కృష్ణా నది మీదుగా రూ.2,047 కోట్లతో 56 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ పూర్తి చేశామన్నారు.












Click it and Unblock the Notifications