నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హతమార్చిన భార్య.. కామారెడ్డిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త మెడకు చున్నీ బిగించి భార్య అత్యంత దారుణంగా భర్తను హతమార్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆజంపురా కాలనీలో మంగళవారం చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే
ఆజంపుర కాలనీలో నివాసముండే 37 సంవత్సరాల అఫ్రోజ్ ఖాన్ కు, భార్య ఫర్జానా బేగం, ఓ కుమారుడు ఉన్నారు. ఫర్జానా మొదటి భర్తను వదిలేసి అఫ్రోజ్ ను రెండవ పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్ ఖాన్ గతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే కొద్ది రోజుల నుండి అల్లం వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్న క్రమంలోనే భర్తను హతమార్చినట్లుగా భార్య చెబుతుంది. మద్యం సేవించి వచ్చిన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో అతని మెడకు చున్నీ బిగించి అత్యంత దారుణంగా హతమార్చింది.

అయితే ఫర్జానా బేగం వివాహేతర సంబంధం పెట్టుకుందని, భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హతమార్చింది అని అఫ్రోజ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు అఫ్రోజ్ ఖాన్ మద్యం తాగి వచ్చి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ క్రమంలోనే విసిగిపోయి హతమార్చినట్లుగా చెబుతుంటే, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగా భార్య దారుణంగా భర్తను హత్య చేసిందని అఫ్రోజ్ బంధువులు చేస్తున్న ఆరోపణలతో పోలీసులు, భార్య ఒక్కరే హత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా హత్యకు సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, అన్ని కోణాల్లోనూ కేసును విచారణ చేస్తున్నామని డిఎస్పి సోమనాధం చెబుతున్నారు.
కారణాలేవైనా ఇటీవల కాలంలో భర్తలను హతమారుస్తున్న కసాయి భార్యల సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు ఇటువంటి దారుణాలకు మగవాళ్లు మాత్రమే పాల్పడితే, ఇప్పుడు ఆడ వాళ్ళు కూడా తామేమీ తీసిపోము అన్న చందంగా భర్తల పై దాడులకు పాల్పడుతున్నారు. అత్యంత దారుణంగా భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవాల్సిన వారు, ఆ పని చేయకపోగా హత్యలకు పాల్పడుతున్న తీరు సమాజానికి ఆందోళనకరంగా మారింది. తాజా కేసులో భర్తను హతమార్చిన భార్య కటకటాల పాలు కాగా, అటు తండ్రి లేక, తల్లి జైలు పాలై వారి కుమారుడు ప్రస్తుతం అనాథగా మారాడు.












Click it and Unblock the Notifications