అజరుద్దీన్ ఇంట్లో భారీ చోరీ- గోడలపై ఏమేమో రాశారు..!!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ అజరుద్దీన్ బంగళాలో భారీ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కొంత నగదు, విలువైన వస్తువులను దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు.
అజరుద్దీన్, ఆయన భార్య సంగీతా బిజ్లానీకి చెందిన లోనావాలాలోని బంగ్లాలో ఈ చోరీ ఘటన జరిగింది. పూణే రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- మహారాష్ట్రలోని మావల్ తాలూకా పరిధిలో గల టికోనా పేట్ లోని అజరుద్దీన్, సంగీత బిజ్లానీకి ఓ విలాసవంతమైన బంగళా ఉంది.

అందులో ఈ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లా వెనుక గోడకు ఉన్న వైర్ మెష్ ను కత్తిరించి లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత మొదటి అంతస్తులోని గ్యాలరీకి చేరుకుని, కిటికీ గ్రిల్ పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. 50,000 రూపాయల నగదు, విలువైన టీవీని దొంగలు అపహరించారు. బంగళాలో ఉన్న విలువైన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీనితో సుమారు 60,000 రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తోన్నారు. అజరుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహ్మద్ ముజీబ్ ఖాన్ ఈ మేరకు లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
ముజీబ్ ఖాన్.. సంభాజీనగర్‌కు చెందిన వ్యక్తి. ఈ బంగళా కేర్ టేకర్ గా పని చేస్తోన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోనావాలా రూరల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై భారత్ న్యాయసంహితలోని సెక్షన్లు 331(3), 331(4), 305(ఎ), 324(4), 324(5) కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. ఈ కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తోన్నారు. గోడలపై పెయింట్ తో కొన్ని బూతుపదాలను రాసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications