వెనుక గోడకు కన్నం వేసి యస్ మార్ట్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల చోరీ
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ యస్ మార్ట్‌లో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. దుకాణం వెనుక భాగంలో కన్నం వేసి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వస్తువులను దోచుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు, దొంగతనాలు వణికిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని లాట్ మొబైల్ షట్టర్‌ను బద్దలు కొట్టి షోరూంలోని విలువైన మొబైల్స్‌ను ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా, ఎల్బీ నగర్ ఎస్ మార్టులో భారీ దొంగతనం జరిగింది.
యస్ మార్టు ఎలక్ట్రానిక్ షోరూంలోకి చొరబడ్డ దొంగలు ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. షోరూం వెనుక గోడకు భారీ కన్నమేసిన దొంగలు గుట్టుచప్పుడు తమ పని కానిచ్చారు. బుధవారం ఉదయం షాపుకు వచ్చిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం ఖిల్లా సెంటర్‌లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి రాఘవేంద్ర పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చికిత్స కోసం అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాఘవేంద్ర శరీరం 70శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు.
లారీని ఢీకొన్న బస్సు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బైలడిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయివేటు బస్సు... తల్లాడ మండలం పరిధిలోని మంగాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నించి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మరోవైపు, కరీంనగర్ జిల్లాలో ఓ లారీ డ్రైవర్ హల్ చల్ చేశాడు. చెక్ పోస్టు వద్ద లారీ ఆపకుండా ఢీకొట్టి వెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
నైజీరియా జైలు నుంచి మా కొడుకును విడిపించండి
రెండేళ్లుగా నైజీరియా జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ కొడుకును విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను పాలమూరు జిల్లాకు చెందిన మెరైన్ ఇంజినీర్ మనోజ్ తల్లిదండ్రులు కోరారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని భారత పర్యటనకు వస్తున్న నైజీరియా అధ్యక్షుడితో చర్చించాలని కోరారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దశరథ్ దంపతుల కుమారుడు మనోజ్ కుమార్ 2013లో ఘనాలోని షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజినీర్‌గా చేరాడు. 2014 జూలైలో ఘనా నుంచి కెమెరూన్‌కు స్క్రాప్‌ను షిప్‌లో తరలిస్తుండగా అది సముద్రంలో చెడిపోయింది. దానికి మరమ్మతులు చేయడానికి నెల రోజులు పట్టింది.
ఈ నేపథ్యంలో దేశంలోకి అక్రమంగా చొరబడ్డారనే అభియోగాలపై షిప్‌లో ఉన్న మనోజ్, మరో పదిమందిని నైజీరియన్ పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అరెస్ట్ విషయం గతేడాది ఆగస్టులో తెలిసిందని మనోజ్ తండ్రి దశరథ్ వాపోయాడు. మనోజ్‌ను నైజీరియా జైలు నుంచి విడిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications