కొండా మురళి వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలు వ్యవహారంలో లేటెస్ట్ ట్విస్ట్ ఇదే!
తెలంగాణ కాంగ్రెస్ లో, అందులో వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండ మురళి దంపతులు వర్సెస్ వరంగల్ లోకల్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అన్నట్టు హోరాహోరీగా ఫైట్ కొనసాగుతుంది. వీరి మధ్య పంచాయితీకి అధిష్టానం తెర దించుతుంది అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి కానీ ఈ పంచాయితీకి పుల్ స్టాప్ పెట్టడం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కూడా కాస్త కష్టంగానే కనిపిస్తుంది.
కొండా మురళి దంపతులపై ఫిర్యాదులు
కొండ మురళి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల పైన సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండా దంపతుల తీరుతో విసిగిపోయిన స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కు, పిసిసి చీఫ్ కు అనేకమార్లు ఫిర్యాదులు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు , నాయకులపై అధిష్టానానికి వివరణ లేఖ ఇచ్చిన కొండా కపుల్
కొండా మురళి దంపతులు కూడా తామేమి తగ్గలేదు అన్నట్టుగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తీరుపైన, జిల్లాలో పరిస్థితులపైన, వారు చేస్తున్న పనులపైన తీవ్ర సంచలన ఆరోపణలు చేస్తూ వారి పైన కూడా ఫిర్యాదులు చేశారు. ఇక తాజాగా క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడిగిన వేళ కొండా సురేఖ దంపతులు మరోమారు జిల్లాలో పరిస్థితులు, ఎమ్మెల్యేల తీరుపైన లిఖితపూర్వకంగా వివరణ ఇస్తూ కారణాలను అందులో పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న పీసీసీ
ఇక ఇదే సమయంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి, ఎన్నికలలో పార్టీని గెలిపించడానికి తాము ఎంతగా కృషి చేస్తున్నామో కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారిచ్చిన వివరణ తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ప్రస్తుతం ఎమ్మెల్యేలతో మాట్లాడమని పిసిసి నాయకత్వానికి బాధ్యత అప్పగించారు. అయితే వారు ఇచ్చిన వివరణ పైన మాట్లాడడానికి రావాలని పిసిసి ఎమ్మెల్యేలకు ఆహ్వానాన్ని పంపించింది.
ఎమ్మెల్యేలకు పిలుపు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కు పీసీసీ క్రమశిక్షణ సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి వివరణ ఇచ్చి వచ్చారు.
రేపు ఎమ్మెల్యేల వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందో?
మిగిలిన ఎమ్మెల్యేలు చర్చించడానికి సోమవారం రావాలని ఆయన వారికి సూచించారు. ఇక సోమవారం జరిగే సమావేశం అనంతరం క్రమశిక్షణ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలిసే అవకాశం ఉంది. కొండా దంపతులపైన చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే కొండా దంపతుల తీవ్రమైన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయాలని ఆలోచిస్తుంది.












Click it and Unblock the Notifications