తమిళనాడులో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ముగ్గురు భక్తులు మృతి
చెన్నై/హైదరాబాద్: తమిళనాడులోని దిండిగల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందినవారు ములుగు జిల్లా కమలాపురం వాసులుగా గుర్తించారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్: ఒకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 60 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వృద్ధుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బైక్‌ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం అన్నదమ్ములు మృతి పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో మంథనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తాటి నాగరాజు గౌడ్, నవీన్ గౌడ్ దుర్మరణం చెందారు. మంథనికి చెందిన సోదరులిద్దరు మంథని నుంచి బేగంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుంటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
గ్యాస్ సిలిండర్ పేలి మహిళ సజీవదహనం : నిర్మల్ జిల్లాలోని భైంసా మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కమోల్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతిచెందింది. రాత్రి వేళ ఇంట్లో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ద్రుపద బాయి అనే మహిళ సజీవదహనమైంది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications