ఎంపీ నామా కుమారుడిని కత్తితో బెదరించి, కారులో తిప్పి, రూ. 75వేలు దోపిడీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీని కత్తులతో బెదిరించిన దుండగులు డబ్బులు కాజేశారు. పృథ్వీ అకౌంట్ నుంచి రూ. 75వేలు ఆన్‌లైన్‌లో వారి ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు. దుండగుల దాడిలో గాయపడి తప్పించుకున్న పృథ్వీ.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారు పృథ్వీ బిజినెస్ మ్యాన్. శనివారం స్నేహితుడి వద్దకు కారులో వెళుతుండగా.. టోలిచౌకీ వద్ద ఇద్దరు దుండగులు తమ బైక్ అడ్డుపెట్టి బలవంతంగా పృథ్వీ కారులోకి ఎక్కారు.

డ్రైవింగ్ సీటులో ఉన్న పృథ్వీ మెడపై కత్తి పెట్టి కొండాపూర్ వైపు తీసుకెళ్లాలని బెదిరించారు. దీంతో అతడు అలానే చేశాడు. మార్గమధ్యలో వైన్స్ షాపులో మద్యం సేవించారు దుండగులు. అక్కడి నుంచి కొండాపూర్ వైపు వెళుతుండగా దారిలో మరో వ్యక్తి కారులో ఎక్కాడు. ముగ్గురూ కలిసి కారులోనే పృథ్వీపై పిడిగుద్దులతో దాడి చేశారు. అతని వద్ద నుంచి రూ. 75 వేలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
గచ్చిబౌలి, టోలిచౌకి, మెహదీపట్నం మీదుగా ఎస్ఆర్ నగర్ వైపు వచ్చారు. ఎస్ఆర్ నగర్ లో ఆగివున్న బైక్ ను ఢీకొట్టి తిరిగి.. పంజాగుట్ట వైపు వెళ్తుండగా నిమ్స్ వద్ద పృథ్వీ కారు నుంచి బయటకు దూకేశారు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications