ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్!!
ఉమ్మడి వరంగల్ జిల్లా లో గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేల లో టికెట్ టెన్షన్ ఎవరికి ఉంది? సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చే ఆలోచనలో లేరు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలలో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు? అన్నది ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ముఖ్యంగా గులాబి సిట్టింగ్ ఎమ్మెల్యేల లో గుబులు పట్టుకుంది.
వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది గులాబీ పార్టీ. సీఎం కేసీఆర్ మూడోసారి కూడా విజయ బావుటా ఎగరవెయ్యటానికి అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మార్చి కేటీఆర్ సన్నిహితుడు, ఎంఎల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని బరిలో నిలిపే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.

డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను మార్చి ఆయన కూతురు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితను పోటీలో పెట్టే అవకాశం ఉందని సమాచారం. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను మార్చి మంత్రి సత్యవతి రాథోడ్ ను పోటీలో నిలిపే చాన్స్ ఉందని భావిస్తున్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని మార్చి శాసన సభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారిని బరిలో నిలిపే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను మార్చి మాజీ మంత్రి, ఎంఎల్సీ బస్వరాజు సారయ్యను లేదా కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు శ్రీనివాస్ ను పోటీలో పెట్టే అవకాశం ఉంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను మార్చి మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్సీ కడియం శ్రీహరిని బరిలో నిలిపే అవకాశం ఉంది.
ఈ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేఖత, దీనిపై సీఎం కేసీఆర్ కు అందిన నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ కష్టమే అని చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications