బాబోయ్ పులి.. ఆ జిల్లాలో పశువులు బలి.. థర్మల్ డ్రోన్లతో అన్వేషణ!
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపులి అడవి వీడి జనంలోకి వచ్చి చేరింది. రోజుకో చోట సంచారం చేస్తున్న పెద్ద పులి జనాలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆవులు, దూడల ప్రాణాలు తీస్తూ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గత ఐదు రోజులుగా పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. ఇక తెలంగాణాలోనూ ప్రజలను వణికిస్తుంది.
జనగామ జిల్లాలో హల్చల్ చేస్తున్న పెద్దపులి
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్దపులి హల్చల్ చేస్తోంది. యాదాద్రి జనగామ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజుల కిందటి వరకు యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి ఇప్పుడు సిద్దిపేట జిల్లా మీదుగా జనగాం జిల్లాలోకి అడుగు పెట్టింది.జనగామ జిల్లా శామీర్పేట లోని సుశీలమ్మ వృద్ధాశ్రమం వద్ద పులి సంచరించినట్లు సిసి టివి ఫుటేజ్ లో రికార్డయింది.

ఊరూరూ తిరుగుతూ పెద్దపులి
అక్కడి నుండి పెంబర్తి మీదుగా మళ్లీ యాదాద్రి జిల్లా ఆలేరు మండలం, టంగుటూరు, సారాజిపేట కు చేరుకుని అక్కడ ఒక ఆవు పైన పులి దాడి చేసింది. ఆ తర్వాత అక్కడినుండి గొలనుకొండ వరకు పెద్దపులి పాద జాడలు కనిపించాయని గుర్తించారు. అక్కడ నుండి పులి జాడలు కనిపించలేదు. దీంతో పులి గొలనుకొండ శివారులోని పెద్దగుట్ట పైకి చేరిందా లేదంటే మరో చోటికి వెళ్లిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పులిని పట్టుకోవటం కోసం రంగంలోకి అధికారులు
అయితే ఈ పెద్దపులిని పట్టుకోవడం కోసం అటవీ అధికారులు రంగంలోకి దిగారు. యాదాద్రి, జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు థర్మల్ డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. ఈ పులి జాడ తెలుసుకోవడానికి అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించి తర్వాత చర్యలను చేపట్టారు.
పులి కదలికలపై నిఘా.. స్టేట్ లెవెల్లో స్పెషల్ టెక్నికల్ టీం
పులిని రక్షించడం తో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవలసిన చర్యల పైన అటవీ దళాల ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ సి సువర్ణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి స్టేట్ లెవెల్లో స్పెషల్ టెక్నికల్ టీం ని కూడా ఏర్పాటు చేశారు . త్వరలోనే పులిని పట్టుకుంటామని, ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications