Tollywood Drugs case: ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్: కొడుకు ఆకాష్‌తో కలిసి
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను దుమారానికి దారి తీసిన డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన టాలీవుడ్ నటీనటులు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇదివరకే సమన్లను జారీ చేసింది ఈడీ. దీనికి అనుగుణంగా వారంతా ఒక్కొక్కరుగా ఇక విచారణకు హాజరు కానున్నారు. పూరీ జగన్నాథ్‌తో ఆరంభమైన ఈ విచారణల పర్వం.. ఆయన ఒక్కడితో ఆగేలా కనిపించట్లేదు.
ఇదివరకు టాలీవుడ్‌లో చిన్నపాటి భూకంపాన్ని పుట్టించిన ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని తిరగదోడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. డ్రగ్స్ కేసు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వారిలో టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. తన కుమారుడు, మీరో ఆకాష్ పూరీతో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

వారి వెంట- పూరీ జగన్నాథ్ సొంత ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ వైష్ణో అకాడమీకి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఉన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ చేపట్టిన విచారణ పూరీ జగన్నాథ్‌తో ఆరంభమైనట్టే. ఈడీ అధికారులు ఈ రోజంతా ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. రేపు కూడా ఇదే ఎంక్వైరీని కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఇదివరకు అధికారులు ఇదే డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ సహా ఆయనతో అసోసియేట్ అయి ఉన్న నటి ఛార్మి, నటుడు తరుణ్ వంటి పలువురు నటులను ప్రశ్నించారు.
ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలకమైన లీడ్స్ దొరకడంతో విచారణను పునఃప్రారంభించారు. పూరీ జగన్నాథ్‌తో ఆరంభమైన ఈ విచారణల పర్వం.. ఇక- సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్ కేసు మూలాల నుంచీ ఆరా తీస్తారని తెలుస్తోంది. ఇప్పటిదాకా వెలుగులోకి రాని కొన్ని పేర్లు కూడా బయటికి వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న టాలీవుడ్ ప్రముఖులందరినీ వరుసబెట్టి విచారణకు పిలవనున్నారు.
ఇది ముగింపుదశకు వచ్చే సరికి కొన్ని అరెస్టులు కూడా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అటు బాలీవుడ్‌లోనూ ఇదే తరహా డ్రగ్స్ కేసులో విచారణలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నటుడు అర్మాన్ కోహ్లీని నార్కొటిక్స్ బ్యురో అధికారులు ఇదివరకే అరెస్ట్ చేశారు. స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో కన్నడనాట శాండిల్‌వుడ్‌లోనూ డ్రగ్స్ కేసు విచారణలు కొనసాగాయి.












Click it and Unblock the Notifications