దిగ్భ్రాంతి: టాప్ హీరోయిన్‌పై కన్నేసి, వెంటపడిన నయీం?
హైదరాబాద్: ఎదురు కాల్పుల్లో మరణించిన గ్యాంగస్టర్ నయీం ఓ టాప్ హీరోయిన్‌పై కన్నేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తాకథనంగా కూడా ప్రచురించింది.
నయీంతో బడా రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినీ నిర్మాతలు, హీరోలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టాలీవుడ్‌కు చెందిన ఒక టాప్ హీరోయిన్ తన వివాద పరిష్కరానికి నయీంను ఆశ్రయించినట్లు చెబుతున్నారు. తెలుగు సినిమాల్లోనే కాకుండా దక్షిణాది భాషల్లోని పలు చిత్రాల్లో ఆ హీరోయిన్ నటించింది. ఈ టాప్ హీరోయిన్ కొన్నేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు కొనుక్కున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఈ ఇంటిపై వివాదం చెలరేగిందని, ఆ వివాదంలో నయీం తలదూర్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణకు చెందిన ఒక మంత్రి దృష్టికి ఆ హీరోయిన్ తీసుకుని వెళ్లిందని, ఈ విషయం తెలుసుకున్న నయీం సమస్యను తాను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.

అలా చెప్పిన నయీం ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి వేధించినట్లు టాలీవుడ్ గుసగుసలు. నువ్వంటే నాకిష్టమని, ఎంత కావాలంటే అంత ఇస్తానని వేధించడం ప్రారంభించాడని అంటున్నారు. ఆ వేధింపులతో ఆ హీరోయిన్ హైదరాబాద్ నుంచి మకాం మార్చినట్లు చెబుతున్నారు.
నానక్‌రామ్ గుడా ప్రాంతంలోని హీరోయిన్ ఆరు ఎకరాల స్థలాన్ని నయీం కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ హత్య కేసులో కూడా నయీం పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాదులో నయీంకు చెందిన 15 ఏకరాల ఫాం హౌస్‌ను సిట్ అధికారులు గుర్తించారు. దుర్గామాత సొసైటీలో కూడా 60 ప్లాట్లను నయీం కబ్జా చేసినట్లు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో ఓ న్యాయవాది హత్య వెనుక నయీం హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూవివాదం కారణంగానే ఆ న్యాయవాదిని హత్య చేసినట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, గ్యాంగ్‌స్టర్ నయీం దందా ఖమ్మం జిల్లాకు కూడా విస్తరించిన సూచనలు కనిపిస్తున్నాయి. చింతకాని మండలంలోని పందిళ్లపల్లిలోని గాంధీనగర్ కాలనీలో ఉన్న ఓ ఇంటికి 2011-14 సంవత్సరాల మధ్య ఓ వ్యక్తి ఖరీదైన కార్లలో మహిళలు, చిన్నపిల్లలతో కలిసి వెళ్తుండే వాడని స్థానికులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి స్థానికులు విరాళం అడుగగా, రూ.1,10,116 ఇచ్చాడని, తన తల్లిదండ్రుల పేర్లను శిలాఫలకంపై చెక్కించాలని సూచించినట్టు చెప్పారు. దాంతో ఆలయ నిర్వాహకులు ఎండీ తాహేరాబేగం, ఎండీ నజీరుద్దీన్ పేర్లతో గుడిలో శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఫొటోలు మీడియాలో చూపించడంతో ఆ ప్రాంతానికి వచ్చింది నయీంగానే భావిస్తున్నామని స్థానికులు తెలిపినట్లు ఓ ప్రముఖ దినపత్రికలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications