మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ సీరియస్..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత పాలనా పరంగా - రాజకీయంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయాల అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ లో సంచలనంగా మారుతోంది.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తోంది. కొంత కాలంగా ఈ ఎన్నికల నిర్వహణ పైన ప్రచారం సాగుతోంది. అయితే, ఇందుకు సంబంధించి తుది నిర్ణయం జరగాల్సి ఉంది. కాగా, మంత్రి పొంగులేటి ఆదివారం ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ కార్యాకర్తలతో ఈ ఎన్నికల పైన మాట్లాడారు. ఈ నెలాఖరులో గా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ముందుగా జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంద ని.. ఆ తరువాత పంచాయిత్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్ధులను ఖరారు చేస్తామని వెల్లడించారు.

స్థానిక సంస్థలకు ఎన్నికలకు పార్టీ కేడర్ సిద్దం కావాలని పొంగులేటి సూచించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపైన మండి పడ్డారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడిన అంశంపై ప్రకటనను టీపీసీసీ చీఫ్ తప్పు బట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే ఎలా ప్రకటిస్తారని నిలదీసారు.
ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన మరొకరు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించ కుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. గతంలో సీతక్క ఎన్నికల గురించి వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు పొంగులేటి పైన టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యవహారం పార్టీలో సంచలనంగా మారుతోంది.












Click it and Unblock the Notifications