రేవంత్ సెల్ఫ్ గోల్ - ఇక పేరుకే ప్రెసిడెంట్ : రిమోట్ కంట్రోల్ ఆపరేషన్..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ రాజకీయం అర్దం చేసుకోవటంలో వెనుకబడ్డారు. సీనియర్లను విస్మరించారు. నేతలు పార్టీ వీడుతున్నా వారిని వారించటంలో విఫలమయ్యారు. ఫలితంగా కాంగ్రెస్ సహజ సంస్కృతి లో భాగంగా ఫిర్యాదు లేఖలు వెళ్లాయి. నేరుగా సోనియాకు సీనియర్లు లేఖలు రాసారు. దీంతో, ఇప్పుడు కాంగ్రెస్ కొత్త చీఫ్ రాగానే ప్రక్షాళనకు నిర్ణయించారు. రేవంత్ అధ్యక్ష పదవికి ఢోకా లేకపోయినా.. అధికారాలు మాత్రం నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు నేరుగా రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఆపరేట్ చేయనుంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన..
తెలంగాణలో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ గా మారిన రాజకీయంలో కాంగ్రెస్ వెనుకబడింది. తెలంగాణ ఇచ్చినా రాజకీయంగా నిలబడకపోవటం పైన హైకమాండ్ తలలు పట్టుకుంటోది. 2014,2019 ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండో స్థానంలో ఉందని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో, వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ చికిత్స ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేతగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ రాష్ట్రాల ఇంఛార్జ్ లు రాజీనామా చేసారు. తెలంగాణకు త్వరలో కొత్త ఇంఛార్జ్ రానున్నారు. అదే సమయంలో టీపీసీసీ నూతన కార్యవర్గం రేవంత్ అధ్యక్షతన ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో కసరత్తు జరిగింది. డిసెంబర్ 4 లేదా 5వ తేదీన కొత్త జాబితా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తెలంగాణ పైన ఇక నేరుగా టెన్ జన్ పథ్ పర్యవేక్షణ కొనసాగనుంది.

టీపీసీసీ ఇక ప్రియాంగా గాంధీ చేతుల్లోకి...
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కొనసాగుతారు. కానీ, నిర్ణయాధికారం.. కార్యాచరణ మొత్తం ప్రియాంకా గాంధీ చేతుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ కు భారీ అంచనాల నడుమ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది. వరుసగా ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవటం..సీనియర్లు పార్టీని వీడటం..రేవంత్ పైన వస్తున్న ఫిర్యాదులు.. సీనియర్ల అభ్యంతరాలతో రేవంత్ ను కొనసాగిస్తూనే తామే నేరుగా తెలంగాణ వ్యవహారాల పైన దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా వచ్చే నెలలో ప్రియాంక హైదరాబాద్ పర్యటనకు రానున్నట్లు సమాచారం. పార్టీలో నియామకాలు పూర్తయిన వెంటనే..పార్టీ కార్యవర్గంతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో పార్టీకి రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్రకు సిద్దమవుతున్న రేవంత్...
పార్టీ పగ్గాలు చేపట్టినా.. ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదనే అభిప్రాయం పార్టీలో రేవంత్ పైన ఉంది. దీనిని అధిగమించి ప్రజల్లోకి వెళ్లేందుకు రేవంత్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీని పైన పార్టీ అధినాయకత్వంతోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మొత్తం టీఆర్ఎస్..బీజేపీ చుట్టూ తిరుగుతోంది. దీంతో, కాంగ్రెస్ కేడర్ లో నైరాశ్యం కనిపిస్తోందని సీనియర్లు చెబుతున్నారు. పార్టీ నేతలు సైతం ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయం చూడటానికి ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేరుగా ప్రియాంకా గాంధీ పార్టీ వ్యవహారాలు చూడాలని నిర్ణయించారనే సమాచారం తో సీనియర్లు ఆశావాహంతో కనిపిస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications