వంకర బుద్ధితో యాగాలు చేస్తే ఫలితముండదు: కేసీఆర్ చండీయాగంపై రేవంత్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బరితెగించిందని, స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్ధులంతా ఫిరాయింపుదారులేనన్నారు.
ఫిరాయింపుదారులు, పెట్టుబడిదారులనే సీఎం కేసీఆర్ నమ్ముకున్నారన్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్‌ను కోరినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లేనన్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

అలాగే రాష్ట్రంలోని మంత్రుల వెనుక ఎన్నికల సంఘం షాడో టీంలను పెట్టాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆరు స్థానాలను గెలుచుకుందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ఆయుత చండీయాగంపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
వంకర బుద్ధితో యాగాలు చేస్తే ఫలితముండదని, పవిత్ర మనసుతో ఒక దండం పెట్టుకుంటే చాలని వ్యాఖ్యానించారు. శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరిగిన, జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తనకు బలం లేకున్నా అభ్యర్ధులను నిలబెట్టిందన్నారు.
యాగాలు చేసినా తగిలే పాపం తగలకపోదు: కేసీఆర్ పై కోమటిరెడ్డి నిప్పులు
తెలంగాణలో ప్రతిపక్షాల వారిని మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన పాపాలను కడుక్కునేందుకే యజ్ఞయాగాలు చేస్తున్నారని, ఎన్ని యాగాలు చేసినప్పటికీ, తగిలే పాపం తగలకుండా పోదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని, ఒకవేళ అతను గెలవకుంటే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, టీఆర్ఎస్ తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డ మాలాంటి నేతలపైనే కేసీఆర్ కక్షగట్టాడని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తోందని కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆరోపించారు. సంఖ్యా బలం లేకున్నా, రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించిందని గుర్తు చేసిన ఆమె, దిగజారుడు రాజకీయాలు చేస్తూ, వారిని గెలిపించుకునేందుకు అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.
బెదిరింపులకు పాల్పడుతోందని ఉత్తమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఓపెన్ విధానంలో విప్ జారీ చేసే పద్ధతిన నిర్వహిస్తే బాగుంటుందన్నారు.
రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు బలం లేకున్నప్పటికీ అభ్యర్థిని నిలబెట్టి అప్రస్వామ్యక విధానంలో గెలవాలనే ధోరణిలో ఉందన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.












Click it and Unblock the Notifications