Rahul Gandhi: రాహుల్ గాంధీని కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీని కలిశారు. కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి వివరించారు. ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం హస్తినాకు వెళ్లారు. శుక్రవారం ఆయన కేసీ వేణుగోపాల్ తో కూడా సమావేశం అయ్యారు. 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 50 రోజులు అయిందని.. తాను నిర్వహించిన కార్యక్రమాలు, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఆయన వేణుగోపాల్ కు వివరించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, నూతన కమిటీల నియామకం, రాజకీయ పరిస్థితులపై అధిష్ఠానంతో చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో జరగబోయే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ జరుగుతున్న విషయాలను వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీలో జీవన్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధిష్ఠానంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చించే అవకాశం ఉంది.

తన అనుచరుడు హత్యకు గురికావడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే జీవన్ రెడ్డితో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయంపై మహేశ్ కుమార్ గౌడ్ చర్చించారా లేదా తెలియరాలేదు. అలాగే కొండా సురేఖ వివాదంపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండ సురేఖ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలతో పార్టీ డిఫెన్స్ లో పడింది.
దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ ను అధిష్ఠానం ఆరా తీసినట్లు సమాచారం. కాగా కష్టపడి పని చేసిన వారికే పార్టీ పదవులు ఉంటాయని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications