Tragedy: తీవ్ర విషాదం.. ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం
Tragedy: ఇద్దరూ ప్రేమించుకున్నారు. వందేళ్లు కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. చివరకు పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరు కలిసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిధిలో చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం రెండు గ్రామాల్లో విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిత్యలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్(24) కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన అలేఖ్యతో అరుణ్ కుమార్ కు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. రెండేళ్ల నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్యకు పెళ్లి చేసేందుకు వాళ్ల ఇంట్లోని పెద్దలు సంబంధాలు చూస్తున్నారు.

ఇంట్లో తమ ప్రేమను చెబితే పెద్దలు ఒప్పుకోరని భావించిన అరుణ్ కుమార్, అలేఖ్యలు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి జరగదని భావించిన వారు.. కరీంనగర్ లోని మిత్రుని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనాలోచిత నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.












Click it and Unblock the Notifications