తెలంగాణా దశాబ్ది వేడుకల్లో విషాదం.. విద్యార్ధి ప్రాణం తీసిన విద్యా దినోత్సవ ర్యాలీ!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక శాఖ సాధించిన ప్రగతిని తెలియజేస్తూ అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు విద్యా దినోత్సవం సందర్భంగా విద్యా శాఖలో సాధించిన ప్రగతిని తెలియజేయడం కోసం ర్యాలీలు నిర్వహించారు.
హన్మకొండలో జరిగిన ర్యాలీలో ఊహించని విషాదం చోటు చేసుకోగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే తెలంగాణ దశాబ్ది సంబరాలుగా ఈనెల 2వ తేదీ నుండి జూన్ 22 వ తేదీ వరకు, మొత్తం 21 రోజులపాటు నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయం మేరకు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు ఈ సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు 19 వ రోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, మర్రిపల్లిగూడెం లో విద్యా దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీస్తుండగా విద్యార్థులపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఈ సమయంలో కుక్కల దాడి నుండి తప్పించుకోవటానికి అక్కడ నుండి పరుగు తీసిన విద్యార్ధి ప్రమాదానికి గురయ్యాడు. ఆరవ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల ఇనుగాల ధనుష్ అటుగా వెళ్తున్న ట్రాక్టర్ కిందపడిపోయాడు.
దీంతో ధనుష్ మృతి చెందాడు ధనుష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం ధనుష్ మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి శవ పంచనామా నిర్వహిస్తున్నారు. ధనుష్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా కుమారుడి కోసం రోదిస్తున్నారు.
ధనుష్ తో పాటు చదువుతున్న విద్యార్థులు, స్కూల్ టీచర్లు ఈ ఘటనతో షాక్ కు గరయ్యారు. చదువుకుంటూ, ఆడుకుంటూ హాయిగా స్కూల్ కు వెళ్ళే చిన్నారి ఇలా విద్యా దినోత్సవ ర్యాలీలో మృతి చెందటం పట్ల అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాద ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications