పిల్లి కోసం ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..
ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఒక యంగ్ డాక్టర్.. వృత్తి జీవితంలో అడుగుపెట్టక ముందే అనంత లోకాలకు వెళ్లిపోయింది. అందరి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్, తన ప్రాణాన్ని తానే తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సికింద్రాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన, యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి అద్దం పడుతోంది. 23 ఏళ్ల యువ వైద్యురాలు టి. ప్రిన్సీ అలియాస్ శ్రేష్ఠ ఆత్మహత్య వెనుక ఒక ఉన్న కారణాలు విస్మయానికి గురి చేస్తున్నాయి.
శ్రేష్ఠ తన తల్లి, అమ్మమ్మతో కలిసి అల్వాల్‌లో నివసిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఆమె ఒక పిల్లిని ముచ్చటపడి ఇంటికి తెచ్చుకున్నారు. అయితే, ఆ పిల్లి వచ్చినప్పటి నుంచి శ్రేష్ఠకు తరచుగా జలుబు, దగ్గు రావడం మొదలైంది. "పిల్లి వల్లే నీకు అనారోగ్యం కలుగుతోంది, దానిని ఇంట్లో ఉంచవద్దు" అంటూ తల్లి, అమ్మమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా ఇంట్లో తరచుగా వాగ్వాదాలు జరుగుతున్నాయని, శుక్రవారం ఈ గొడవ మరింత తీవ్రమైందని పోలీసులు వెల్లడించారు.

నిర్జీవంగా పడి ఉన్న డాక్టర్..
శుక్రవారం సాయంత్రం తల్లి, అమ్మమ్మ బయటకు వెళ్లిన సమయంలో శ్రేష్ఠ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. వారు తిరిగి వచ్చి చూసేసరికి తన గదిలో శ్రేష్ఠ నిర్జీవంగా కనిపించారు. కళ్ల ముందే కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. సమాచారం అందుకున్న అల్వాల్ సబ్-ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర బృందం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఒత్తిడిలో ఉన్నారా? అన్ని కోణాల్లో దర్యాప్తు!
శ్రేష్ఠ ఇటీవల తన వైద్య విద్యను పూర్తి చేసి, పీజీ (PG) ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మెడికల్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్న ఆమె, కెరీర్ పరంగా ఎంతో కీలకమైన దశలో ఉన్నారు. పిల్లి గొడవ కేవలం ఒక నెపం మాత్రమేనా? లేక పరీక్షల ఒత్తిడి లేదా ఇతర మానసిక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించకపోవడంతో, తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications