అపర్ణతో సహజీవనం, యామినితో పెళ్లి: మొదట వద్దనుకొని, కాళ్లు పట్టుకున్నా కూతుర్ని చంపేశాడు
హైదరాబాద్: సంచలనం రేపిన చందానగర్ హత్యల మిస్టరీ వీడింది. పోలీసులు నిందితుడు మధును జైలుకు తరలించారు. ఈ కేసులో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. తనను, అమ్మమ్మను చంపవద్దని నాలుగేళ్ల పాప ఏడ్చినా మధు హృదయం కరగలేదు. అపర్ణతో పాటు జయలక్ష్మి, కార్తికేయిని దారుణంగా చంపేశాడు.
Recommended Video

తన ఇద్దరు భార్యలు యామిని, అపర్ణల గొడవ భరించలేకనే తాను మద్యం మత్తులో హత్యలకు పథకం రచించానని నిందితుడు మధు పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఈ మేరకు మంగళవారం వివరాలు తెలిపారు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఉలంపార్రుకు చెందిన మధు 10వ తరగతి చదువుతుండగానే బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. తన సోదరుడి సెల్ ఫోన్ షాపులో పని చేసేవాడు.

అపర్ణతో సహజీవనం తెలిసి, యామినితో పెళ్లి
2007లో అపర్ణ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చింది. అప్పటి నుంచి మధు ఆమెను అనుసరిస్తూ వచ్చాడు. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమెతో సన్నిహితంగా మెలిగి, సహజీవనం సాగించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది కుదరలేదు. మధు - అపర్ణల విషయం తెలిసి అతని తల్లిదండ్రులు పాలకొల్లు తీసుకెళ్లి యామినితో వివాహం జరిపించారు.

అలా గొడవలు మొదలయ్యాయి
2008లో మధు, యామినిలు హైదరాబాద్ వచ్చారు. మధు సెల్ ఫోన్ మెకానిక్‌గా పని చేస్తుండగా, యామిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. మధు ఓ వైపు యామినితో కాపురం చేస్తూనే అపర్ణతో గుట్టుగా సహజీవనం సాగించాడు. 2013లో వీరికి ఆడపిల్ల పుట్టింది. ఆమె కార్తికేయి. అపర్ణతో సహజీవనం విషయం తెలిసి యామినితో గొడవలు మొదలయ్యాయి. నిత్యం రెండు కుటుంబాల మధ్య గొడవలు, పరస్పరం ఫోన్లో, బయటా తిట్టుకోవడం మధుకు చికాకు కలిగించాయి. అంతేకాదు, యామినితో అపర్ణ ఫోన్లో మాట్లాడి.. రికార్డ్ చేసి మధుకు వినిపించింది.

అపర్ణ కుటుంబాన్ని అంతం చేయాలని
దీంతో మధు.. అపర్ణ కుటుంబాన్ని అంతే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పథకం వేసి, శుక్రవారం ఉదయం అపర్ణ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అపర్ణ తల్లి విజయలక్ష్మి, చిన్నారి కార్తికేయి ఉన్నారు. విజయలక్ష్మితో గొడవ పడి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమె కిందపడగానే చున్నీతో గొంతుకు ఉరేసి చంపేశాడు.

అడ్డుకున్న కూతురును దారుణంగా చంపేశాడు
అమ్మమ్మ హత్యను చూసిన చిన్నారి కార్తికేయి తండ్రి కాళ్లావేళ్లా పడింది. చంపవద్దని వేడుకుంది. అమ్మమ్మను ఎందుకు చంపుతున్నావంటూ తండ్రిని ఆ చిన్నారి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు మధు తన బిడ్డ కార్తికేయి చెంపపై బలంగా కొట్టాడు. ఆమె కూడా కిందపడింది. విజయలక్ష్మిని చంపిన చున్నీతోనే చిన్నారి గొంతుకు ఉరేసి చంపేశాడు. ఇద్దరిని పరుపుపై పడుకోబెట్టాడు.

అపర్ణను ఇలా చంపేశాడు
కాసేపటికి మధ్యాహ్న భోజనం కోసం అపర్ణ ఇంటికి వచ్చింది. ఆమె ఫ్రిజ్‌లో నీళ్లు తీసుకుంటుండగా వెనుక నుంచి నెట్టివేశాడు. కిందపడిన ఆమె గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆ సమయంలో రుబ్బు రోలు తీసుకొని అపర్ణ తలపై గట్టిగా పదేపదే కొట్టాడు. దీంతో అపర్ణ చనిపోయింది.

కూతుర్ని వదిలేద్దామనుకున్నా, యామినికి విషయం చెప్పాడు
తన కూతురు, చిన్నారి కార్తికేయిని వదిలేద్దామని మదు మొదట అనుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పాడు. కానీ ఆ సమయంలో వచ్చిన ఆవేశంలో ఎవరినీ బతకనీయవద్దని అందరినీ చంపేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి యామినికి విషయం చెప్పాడు.

యామినిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
యామిని భయంతో ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆదివారం హైదరాబాద్ వచ్చిన వారు యామినిని తీసుకు వెళ్లిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మధు పటాన్ చెరు లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తన వెంట కత్తి, పురుగుల మందు తీసుకొని వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి, రెండు చేతులు కోసుకున్నాడు. చనిపోతానని భావించాడు. కానీ తెల్లారి లేచాడు. రక్తం గది నిండా పడి ఉంది. ఇక లాభం లేదనుకొని రక్తం మరకలు తుడిచేసి, చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications