నేడే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్; పాల్గొననున్న మంత్రి కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నికల పోరు రంజుగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదు? తమ పార్టీని ఎందుకు గెలిపించాలో చెబుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకపక్క మునుగోడులో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎన్నికల అధికారులు పార్టీల ప్రచారాలపై నిఘా కొనసాగిస్తూనే, ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నికపై దేశవ్యాప్త ఆసక్తి.. ఎందుకంటే
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక పైనే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయవర్గాలలో మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా, జాతీయ పార్టీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే, జాతీయ పార్టీ ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది. ఓడిపోతే కెసిఆర్ జాతీయ పార్టీ పై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం ఏవిధంగా పడుతుంది అన్న అంశాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ మునుగోడు ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది.

నేడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్.. పాల్గొననున్న మంత్రి కేటీఆర్
ఇక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ క్రమంలో నేడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. నేడు మంత్రి కేటీఆర్ కూసుకుంట్ల సుధాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో నేడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు.

రేపటితో నామినేషన్లకు తెర .. మునుగోడులో పోటాపోటీగా రాజకీయం
ఇదిలా ఉంటే రేపటితో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై నామినేషన్ల స్క్రూటినీ, 17వ తేదీన నామినేషన్ల విత్ డ్రా ఉండనుంది వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ నిర్వహించి, ఆరవ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెలువరించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ క్రమంలో మునుగోడులో పోటాపోటీగా రాజకీయం కొనసాగుతుంది. భవిష్యత్తు ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక గీటురాయిగా మారుతుందని అన్ని ప్రధాన పార్టీలు భావిస్తుండటంతో తమ సర్వ శక్తులను ఒడ్డి మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్ని ప్రధాన పార్టీల నాయకులు.












Click it and Unblock the Notifications