నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ గెలుపు, 2వ స్థానంలో జానారెడ్డి, బీజేపీ డిపాజిట్..
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించారు. 15,487 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. 21 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి నోముల భగత్ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 15,487 ఓట్ల ఆధిక్యం సాధించారు.
21 రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీకి 74,726 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 59,239 ఓట్లు, బీజేపీకి 6365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు.

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీవైపే ఉన్నారని మరోసారి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలియజేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తాను విజయం సాధించానని నోముల భగత్ విజయం అనంతరం వ్యాఖ్యానించారు. తన గెలుపుకోసం కృషి చేసిన నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా, నాగార్జునసాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తీవ్రంగా శ్రమించాయి. అయితే, చివరకు టీఆర్ఎస్ అభ్యర్థికే ప్రజలు పట్టంకట్టారు.












Click it and Unblock the Notifications