వివాహితకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడి లైంగిక వేధింపులు: ఆత్మహత్య చేసుకుంటామంటూ దంపతుల కన్నీరు
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నవేళ మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక ఇటీవల ఖమ్మంలో బీజేపీ కార్యకర్త, అంతకుముందు ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. రామాయంపేటలోనూ టీఆర్ఎస్ నేతల వేధింపులతో తల్లీకొడుకు నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘటనలో అత్యాచారం కేసులో టీఆర్ఎస్ నాయకులు అరెస్టయ్యారు.

ఇంటి నిర్మాణం అడ్డుకుంటున్న ఎమ్మెల్యే సోదరుడు
తాజాగా, స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ్ముడు తాడికొండ సురేష్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను తాటికొండ సురేష్ లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జంగింటి విజయలక్ష్మీ, రమేష్ దంపతులు తమ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో ఇంటి నిర్మాణం కోసం చాలా ఏళ్ల క్రితమే బేస్‌మెంట్ వరకు నిర్మించారు. అయితే వాళ్ల పనులకు స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ అడ్డుపడుతున్నట్లు బాధితులు ఆరోపించారు.

వివాహితకు ఎమ్మెల్యే సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్యేనంటూ కన్నీళ్లు
ఈ క్రమంలో ఇంటి పర్మిషన్ కోసం తాను గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా సురేష్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడని విజయలక్ష్మీ ఆరోపించింది. తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పినా వినిపించుకోలేదని.. అంతేగాకుండా తనతో అసభ్యకరంగా మాట్లాడాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన చేయి పట్టుకుని లాగాడని.. లైంగిక వేధింపులకు గురిచేశాడని కన్నీటిపర్యంతమైంది. ఈ మేరకు జనగామ డీసీపీకి బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని.. తమకు పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని విజయలక్ష్మీ దంపతులు వాపోతున్నారు.

కూకట్‌పల్లిలో మహిళకు టీఆర్ఎస్ నేత వేధింపులు
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలో మరో టీఆర్ఎస్ నేత ఘాతుకంగా వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కూకట్‌పల్లి కోఆర్డినేటర్ సతీష్ అరోరా తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. తనపై సతీష్ వేధింపులకు పాల్పడుతున్నాడని 30ఏళ్ల మహిళ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. కేపీహెచ్‌బీ ప్రాంతంలో తన ఇంటి పక్కన సతీష్ చేపట్టిన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతడు కొన్ని నెలలుగా తనను వేధిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. అతని వేధింపులు భరించలేక వేరే ప్రాంతానికి వెళ్లి బోటిక్ నడపడం ప్రారంభించానని.. అయితే. అక్కడ కూడా సతీష్ తనను వేధించడం ఆపలేదని వాపోయింది. ఇతరులతో బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు సతీష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుడు సతీష్‌పై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు బుధవారం కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications