అప్పుడు సోనియా బలిదేవత .. ఇప్పుడు మహా దేవతనా : రేవంత్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
ఇంద్రవెల్లి వేదికగా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి . రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లాగా పగలు, ప్రతీకారాలతో రాజకీయాలు చేస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద తిరగగలడా ? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి చాలా దిగజారి మాట్లాడారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిగజారిన భాషను చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైది రెడ్డి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ఒక్క మాట అంటే రేవంత్ రెడ్డి రోడ్డుపై తిరగలేడు
రేవంత్ రెడ్డిలాగా తాము మాట్లాడగలమనీ, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కూడా మాట్లాడగలమని పేర్కొన్న సైదిరెడ్డి, సీఎం కేసీఆర్ తమకు సంస్కారం నేర్పారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక్క మాట అంటే రేవంత్ రెడ్డి రోడ్లపై తిరిగే లేడు అంటూ సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలి దేవత అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకి రాగానే ఆమె మహాదేవత అయిందని, ఇప్పుడు మహా దేవత అని చెప్పుకొస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి తనను హైలెట్ చేసుకోవటానికే సభ పెట్టినట్టుంది
తాను ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో లక్ష మందితో సభ పెట్టే సత్తా తనకుందని, ఇంద్రవెల్లి లో సభ పెట్టడం ఒక లెక్కనా అంటూ రేవంత్ రెడ్డిని సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తామంటే నడవదని, ఇక ఆ విద్యలు కట్టిపెట్టాలని హెచ్చరించారు శానంపూడి సైదిరెడ్డి. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి తనను తాను హైలెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారని, కేవలం సభ తనకోసమే పెట్టుకున్నట్లు ఉందని సైదిరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అవకాశమొస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ మదన పడుతున్నారని, ఆయన టీపీసీసీ చీఫ్ కావడం చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

చరిత్ర మరిచి విమర్శలు చేస్తే సహించం
రేవంత్ రెడ్డి తన చరిత్ర మంచి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. జనాల్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే ఆలోచన తప్ప, నిన్న నిర్వహించిన సభలో ఏమీ లేదని సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రవెల్లి సభకు పదివేల మంది వచ్చారో ..లక్ష మంది వచ్చారో జనాలందరికీ తెలుసని సైదిరెడ్డి విమర్శించారు. నిన్న ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ గురించి ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

దళిత గిరిజన దండోరాలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే నిన్న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ ఎస్టీల జీవితాలు చితికి పోతున్నాయని నిప్పులు చెరిగారు .ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ఎస్సీలు గుర్తొస్తారు అని పేర్కొన్న రేవంత్ రెడ్డి హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అమలు చేస్తామని చెప్పిన దళిత బంధు పథకం రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించారు. దళితులకు మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహాదేవత సోనియా గాంధీ అని, సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications