మునుగోడులో రాజగోపాల్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి గా : పీకే సర్వేలో తేలిందేంటి..!!
తెలంగాణలో మరో బై పోల్ తప్పేలా లేదు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ బీజేపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..మునుగోడులో రాజగోపాల్ బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికలో బీజేపీ నుంచి గెలిచి..కేసీఆర్ కు చెక్ పెట్టాలనేది బీజేపీ వ్యూహం. ఆ దిశగా రాజీనామా చేసి పార్టీలో చేరాలంటూ రాజగోపాల్ కు కమలనాధులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాజగోపాల్ తన మద్దతు దారుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇటు..బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టాలని గులాబీ నేతలు పట్టుదలతో ఉన్నారు.

మునుగోడు..టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా
ఇదే సమయంలో పార్టీ నుంచి బై పోల్ బరిలో దిగేందుకు పలువురు ఆశావాహులు సీఎంను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు టీఆర్ఎస్ నుంచి అసలు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాళ్లు.. రాజీనామా పైన అధికారికంగా స్పందన లేదు. మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మునుగోడు పైన ఇప్పటికే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
మరోవైపు టీఆర్ఎస్ అధినాయకత్వం మునుగోడులో ఉప ఎన్నిక వస్తే అక్కడి ప్రజాభిప్రాయం ఏంటనే దాని పైన సర్వే సైతం చేయించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా ఎవరు అభ్యర్ధి అయితే కలిసి వస్తుందనే దాని పైన అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లుగా సమాచారం. అందులో ప్రధానంగా.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దుబ్బాక.. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత అదే ధీమాతో మునుగోడులోనూ బీజేపీ ముందుడుగు వేస్తోంది.

రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం
దీంతో..అసలు నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వారికి తక్షణం చేయాల్సింది ఏంటనే దాని పైన గులాబీ సర్వేల్లో ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉందనే అంశంతో పాటుగా.. ఇతర పార్టీల పరిస్థితి పైన ప్రత్యేకంగా ప్రశాంత్ కిశోర్ టీం నుంచి నివేదికలు తెప్పించుకున్నారు.
అయితే, ఈ సర్వేలో పార్టీ మార్పు కోసం ఉప ఎన్నిక వస్తే మెజార్టీ ప్రజలు అంగీకరించేందుకు సిద్దంగా లేరని ప్రాధమిక సమాచారంగా తేలినట్లు చెబుతున్నారు. పాలనా పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఈ నియోజకవర్గంలో ఆందోళన చెందాల్సిన స్థాయిలో వ్యతిరేకత లేదని..అయితే, అభ్యర్ధి ప్రాతిపదికన ప్రభావం చూపే అవకాశం ఉందని గుర్తించినట్లు సమాచారం.
దీంతో..రాజగోపాల్ కు అన్ని కోణాల్లోనూ సరైన పోటీ దారుడు ఎవరనేది టీఆర్ఎస్ ప్రస్తుతం పోటీలో ఉన్న వారిలో ఎంపిక చేయనుంది. తాజాగా.. గట్టుప్పల్ను మండలం చేస్తూ ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అభ్యర్ధి.. కార్యాచరణ పై ఫోకస్
మునుగోడుకు నిధులు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వరాలు ప్రకటించేందుకు సిద్ధం చేసి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్వే నివేదికలు సైతం తమకే అనుకూలంగా ఉన్నాయని గులాబీ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ సైతం తాము విశ్వసించే సర్వే టీంలను మునుగోడులో దింపింది. ఆ సంస్థల నివేదిక వచ్చిన తరువాత బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకోనుంది.
మునుగోడులో 2014లో తెరాస తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ప్రభాకర్ రెడ్డి 2018లో మళ్లీ పోటీ చేసినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన పేరు రేసులో ముందున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటుగా.. గుత్తా సఖేందర్ రెడ్డి కుమారుడు.. కర్నె ప్రభాకర్.. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
రాజగోపాల్ రాజీనామా ప్రకటన..ఆమోదం తరువాత టీఆర్ఎస్ తమ అభ్యర్ధి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. అయితే..ఈ బై పోల్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీస్ గా మారనుంది.












Click it and Unblock the Notifications