అంత సీన్ ఉందా?: కెసిఆర్ హామీలకు రూ. 30 వేల కోట్లు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాదుకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే 30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. బల్దియా వార్షిక బడ్జెట్ కేవలం 5వేల కోట్లు. అంత ఖర్చు చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం నిధులను ఎక్కడి నుంచి తెస్తుందనేది ప్రశ్నగానే ఉంది.
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే తప్ప, తెరాస హామీలు నెరవేరే పరిస్థితి లేదని మాట వినిపిస్తోంది. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే బల్దియాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటివి అమలు చేయడం కష్టమవుతుందని అంటున్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరం చేసేందుకు చైనాకు చెందిన కంపెనీలు భారీ మొత్తంలో అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే అప్పును మోయగలిగే శక్తి ప్రస్తుతం జిహెచ్ఎంసికి ఉంటుందా అనేది మరో ప్రశ్న. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీమేరకు హైదరాబాద్ నగరంలో ఒక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికే రూ.20 వేల కోట్ల ఖర్చవుతుందని ఎన్నికల ప్రణాళికలో తెరాస చెప్పింది.

గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా కోసం ఇప్పటికే గోదావరి మొదటి దశ, కృష్ణా మూడవ దశ పనుల కోసం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తుంది. వీటికోసం బల్దియా చేసిన అప్పులు తీర్చడమే బల్దియాకు పెనుభారంగా మారింది. మరి అలాంటప్పుడు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) కోసం అవసరమయ్యే రూ.20 వేల కోట్ల అప్పును ఏ విధంగా భరించే శక్తి ఉంది.
తెరాస ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పూనుకుంటే, నగరానికి తాగునీటిని సరఫరా కోసం గోదావరి మొదటి దశ, కృష్ణా మూడవ దశకు కలిపి రూ.5000 కోట్లు ఖర్చు చేస్తుంది. దీనికితోడు తాగునీటి సరఫరా పైపులైన్లను 280 కిలోమీటర్ల పొడవున విస్తరణకు మరో రూ.1900 కోట్లు ఖర్చవుతుంది. అలాగే నగరానికి అవసరమయ్యే విద్యుత్ కోసం ప్రత్యేకంగా 420 కెవి గ్రిడ్ ఏర్పాటుకు రూ.1920 కోట్లు, నగరం మీదుగా వెళ్లే ఆర్ అండ్ బి రోడ్ల కోసం రూ.337 కోట్లు మొత్తంగా రూ.29వేల 157 కోట్లు ఖర్చువుతుందని ఎన్నికల ప్రణాళికలో తెరాస అంచనా వేసింది.
బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలైతే విశ్వనగరం హైదరాబాద్ అద్భుతంగా వెలుగుతుంది. అయితే, ఆ నిధులను సమీకరించి, హైదరాబాదును ఎలా తీర్చి దిద్దుతారనేది కెసిఆర్ చేతుల్లోనే ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!