టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు - నేడే ప్రకటన : జాబితాలో ఉన్నదెవరు..!!
కొద్ది రోజులు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాతో పాటుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు తరువాత ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసారు. ఈ రోజున ఆ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 16వ తేదీతో నామినేషన్ల సమయం ముగియనుంది. దీంతో..ఎంపిక అయిన అభ్యర్ధులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

నేడు ఆరుగురి పేర్లు ప్రకటన
ఇక, స్థానిక సంస్థల కోటాలో అభ్యర్ధులను ఈ నెల 22న ప్రకటించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యుల బలం ఉంది. పార్టీ మిత్రపక్షం ఎంఐఎంకు కూడా ఏడుగురు సభ్యులు ఉండటంతో 110 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏకగ్రీవంగానే వారు ఎన్నికయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఆరుస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది.

ఎమ్మెల్యేగానే కడియంకు ఛాన్స్
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా పరిశీలించినా, వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఆయనను పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే మాజీ ఎంపీ సీతారాం నాయక్, గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్ ఆశావహులుగా ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్ ఒక్కరే ఎస్టీ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి రెండు లేదా మూడు స్థానాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్.రమణ, మధుసూదనాచారితోపాటు మరో ఐదు పేర్లు ప్రధానంగా పరిశీలించినట్లు తెలిసింది.

సామాజిక సమీకరణాల ఆధారంగా
మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ జాబితాలో ఉన్నారు. మున్నూరుకాపు సామాజికవర్గానికి శాసనమండలిలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్‌లో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వెలమ సామాజికవర్గం నుంచి తక్కళ్లపల్లి రవీందర్‌రావు పేరు దాదాపు ఖాయం కాగా, రెడ్డి సామాజికవర్గంలో ఇద్దరికి అవకాశం దక్కనుంది. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి స్థానంలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల కోటాలోనూ ఛాన్స్
దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎంసీ కోటిరెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉండగా, ఇద్దరికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటా లో భానుప్రసాద్ (కరీంనగర్), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్) తిరిగి స్థానిక సంస్థల కోటాలో పోటీకి విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేందర్‌రెడ్డి, భానుప్రసాద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండగా, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యే కోటా అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్నారు.

22న స్థానిక సంస్థల కోటా జాబితా ప్రకటన
ఆయన స్థానంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), వి.భూపాల్‌రెడ్డి (మెదక్) పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. దీంతో.. ఆశావాహలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తిగా సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ ఈ జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోకుంటే ఈ జాబితానే ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications