రేవంత్ రెడ్డి కేసు సహా ఇదీ తీరు!: కెసిఆర్‌తో ఎసిబి డిజి ఎకె ఖాన్ భేటీ
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డిజి ఎకే ఖాన్ మంగళవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మంగళవారం సమావేశమయ్యారు. ఎసిబిలో ఇప్పటి వరకు నమోదయిన కేసులు, వాటి దర్యాఫ్తు పురోగతిని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
ఆయన వివరించిన వాటిలో ఓటుకు నోటు కేసు కూడా ఉంది. ఓటుకు నోటు కేసు పురోగతిని, కేసు దర్యాఫ్తు పని తీరును ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా పలువురు నిందితులుగా ఉన్నారు.
ఇప్పటి వరకు 224 కేసులు నమోదు చేశామని, గత నెలలో 18 కేసులు నమోదు చేశామని ఎకే ఖాన్ ముఖ్యమంత్రికి వివరించారు. ట్రాప్ కేసులతో పాటు పెద్ద మొత్తంలో అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్న వారి వివరాలు సేకరించేందుకు ప్రరత్యేక ఏర్పాటు చేస్తున్నామని సీఎంకు చెప్పారని సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు శాసనసభా సమావేశాలను పదిహేను రోజులపాటు నిర్వహించాలని తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీటీడీఎల్పీ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రధానమైన 21 సమస్యలను గుర్తించామన్నారు.

వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసినట్లు చెప్పారు. ప్రజల పక్షాన సభలో ప్రభుత్వం దిగొచ్చేలా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. మంగళవారం టీటీడీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధి, జి వివేకానంద, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌లతో కలిసి ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు.
రైతు ఆత్మహత్యలు, అధిక ధరలు, దళితులకు 3 ఎకరాల సాగుభూమి పంపిణీ, విద్యుత్, పంటరుణాల మాఫీ, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగం, జీహెచ్‌ఎంపీ పరిధిలో ఓట్ల తొలగింపు, వార్డుల పునర్విభజన, కేజీ టు పీజీ ఉచిత విద్య, పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లో అవినీతి, 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించడం తదితర అన్ని అంశాలను సభలో లేవనెత్తుతామన్నారు.
సీఎంకు బహిరంగ లేఖతో పాటు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆత్మహత్యకు పాల్పడిన 1385 మంది రైతుల జాబితాను పంపించామన్నారు. అసెంబ్లీని 15 రోజులు నిర్వహిస్తేనే ప్రతీ సమస్యపై చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications