ఏపీ మంత్రుల తీరుపై మరోసారి భగ్గుమన్న హరీశ్ రావు
సిద్దిపేట: తాను ఏనాడూ ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదని.. అక్కడి ప్రజలు తెలంగాణలో ఉంటే బాగుంటుందని మాత్రమే చెప్పానని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో అన్నీ బాగున్నాయి ఇక్కడే ఉండండి అని చెప్పానని తెలిపారు. ఉన్నమాటంటే ఉలిక్కిపడుతూ.. ఏపీ మంత్రులు కొందరు తనపై ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
మీకు చేతనైతే ఏపీకి జాతీయ హోదా కోసం పోరాడండి అంటూ ఏపీ మంత్రులకు హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడండి అని సూచించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తమ కాళేశ్వరంలాగా నీళ్లు అందించి మాట్లాండండి అంటూ మంత్రి హరీశ్ రావు.. ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. తాను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదన్నారు.

మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందో పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పానని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తను ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రజల తరపున మాట్లాడితే ఎందుకు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవద్దంటూ.. విడిపోయాక ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించిన నాయకులు.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రులను డిమాండ్ చేశారు హరీశ్ రావు.
తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రికి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని ఇటీవల సవాల్ విసిరారు హరీశ్ రావు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంట్ ఉంది.. కేసీఆర్ కిట్ ఉంది.. కళ్యాణలక్ష్మి ఉంది.. ఎకరానికి రూ. 10వేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు హరీశ్ రావు. ఏపీలోని రాజకీయ నేతల గురించి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టినా ప్రశ్నించరని అన్నారు. ఏపీలో ఏముందని ప్రశ్నించారు. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండు పార్టీలో జనాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. తమ గురించి ఎక్కువగా మాట్లాడకండి.. అది మీకే మంచిది కాదని ఏపీ మంత్రులను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications