అమిత్ షా మార్ఫింగ్ వీడియో: ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీసీఎస్ పోలీసులు ఐదుగురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. గురువారం వారిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు.
అరెస్టయిన వారిలో కాంగ్రెస్ ఐటీ సెల్ నేతలు గీత, శివ, తస్లీమ, మన్నె సతీష్, అస్మా ఉన్నారు. అమిత్ షా వీడియోకు సంబంధించి.. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

రిజర్వేషన్ల అంశంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఢిల్లీలో బీజేపీ నేతల ఫిర్యాదు కంటే ముందే.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు.. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదు చేశారు.
మరోసారి గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడి నోటీసులు ఇస్తామన్న ఢిల్లీ పోలీసులు.. లీగల్ సెల్ నాయకులు లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
కాగా, ఏప్రిల్ 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరయ్యారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ మాటలను వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లు వీడియో ఎడిట్ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమిత్ షా మాటలను వక్రీకరించి, ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ మన్నె సతీశ్, కో-ఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివ కుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు దిల్లీ పోలీసులు గత నెల 29న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్ కు పంపించారు. తాజాగా మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నేడు మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు.












Click it and Unblock the Notifications