టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నా పత్రాలు!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నాపత్రం మాత్రమే లికైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తోపాటు 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అయితే, ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నాపత్రంతోపాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రవీణ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు పెన్ డ్రైవ్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. వాటిని విశ్లేషించిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరికొన్ని ప్రశ్నాపత్రాలు గుర్తించినట్లు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు గానీ, సిట్ అధికారులు గానీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని.. సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. ప్రవీణ్ ఏఈ ప్రశ్నాపత్రం రేణుకకు విక్రయించాడు. ఇక మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి అమ్మేశాడనే దానిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications