టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్: తన భర్త రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ హైకోర్టుకు భార్య
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో పేపర్ లీకేజీ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ విషయమై కమిషన్ ఏర్పాటు చేయాలని సుచరిత కోర్టును కోరింది.
కాగా, రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసులు శాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.మరోవైపు, ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్నవారికి సిట్ నోటీసులు కూడా ఇచ్చింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆధారాలుంటే సిట్ కు సమర్పించాలని స్పష్టం చేసింది. అయితే, సిట్ నోటీసులు అందలేదని రేవంత్ చెప్పారు. ఆధారాలు సిట్ కు ఇచ్చేది లేదన్నారు. సిట్ నోటీసులకు భయపడమని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే ఆధారాలు ఇస్తామని తెలిపారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications