టీఎస్ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్: ఆ ప్రయాణికులకు లాభం చేకూర్చేలా తాజా నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ(TSRTC) బస్‌పాస్ దారులకు మరో మంచి వార్త అందించింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది. ఇక టోల్ ప్లాజా రుసుం కూడా బస్‌పాస్ తోపాటు వసూలు చేయనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్ దారులకు టోల్ ప్లాజా రుసుం వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌పాస్ చూపించి.. ప్రతిరోజూ టోల్ ప్లాజా టికెట్ ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఈ విధానాన్ని ఆర్టీసీ ఎత్తివేసింది. టోల్ రుసుం కూడా కలుపుకుని నెలవారీ బస్‌పాస్ లు జారీ చేయనుంది. తెలంగాణలో ప్రస్తుతం 15వేల వరకు నెలవారీ బస్‌పాస్ లు ఉన్నాయి.

వంద కిలోమీటర్లలోపు రెగ్యూలర్‌గా ప్రయాణించే వారికి మంత్లీ సీజన్ టికెట్ పేరుతో పాస్ లను ఆర్టీసీ అందిస్తోంది. నిత్యం ప్రయాణించే టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఈ పాస్ లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పాస్ తీసుకుంటే సాధారణ ఛార్జీతో పోలిస్తే 33 శాతం రాయితీని సంస్థ అందిస్తోంది. 20 రోజుల ఛార్జీతోనే 30 రోజులపాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.
'ఎక్స్‌ప్రెస్ సర్వీస్ నెలవారీ బస్‌పాస్‌ల్లో గతంలో శ్లాబ్ విధానం అమల్లో ఉండేది. ఉదాహరణకు.. ఒకరు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్లాబ్ విధానం ద్వారా 55 కిలోమీటర్లకు నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేసేది. ఇక మీదట 51 కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. శ్లాబ్ విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, టోల్‌ప్లాజా రుసుం కూడా బస్‌పాస్‌లోనే ఉండనుంది. ఈ నిర్ణయం నెలవారీ బస్‌దారులకు ఎంతో మేలు చేస్తుంది' అని చెప్పుకొచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications