బస్సుల్లో ఉచిత ప్రయాణం వేళ.. టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్: ఫిబ్రవరి 1 నుంచి..
TSRTC: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. మరో గుడ్ న్యూస్ ఇచ్చింది. ఉచిత ప్రయాణం వల్ల విధి నిర్వహణలో ఒత్తిళ్లను ఎదుర్కొంటోన్న ఆ సంస్థలో పని చేస్తోన్న వేలాదిమంది ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఉద్యోగులకు ప్రస్తుతం వర్తిస్తోన్న ప్రమాద బీమా మొత్తాన్నీ భారీగా పెంచింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దీనికోసం యూబీఐతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ భాస్కర్ రావు సమక్షంలో బస్ భవన్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

ఈ ఒప్పందం ప్రకారం.. రూ.40 లక్షల నుంచి కోటి రూపాయలకు ప్రమాద బీమా మొత్తం పెరిగింది. దురదృష్టవశావత్తు రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన లేదా శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద కోటి ప్రమాద బీమా లభిస్తుంది.
రూపే కార్డు ద్వారా మరో 12 లక్షల రూపాయల వరకు బీమా మొత్తం పెరుగుతుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందిస్తుంది. ఫిబ్రవరి 1వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.
ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడారు. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభ పరిణామంగా అభివర్ణించారు. ప్రమాద బీమా మొత్తాన్ని పెంచాలంటూ తాము విజ్ఞప్తి చేసిన వెంటనే యూబీఐ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని అన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయల చొప్పున అందజేశామని సజ్జనార్ తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.
రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు. రెండేళ్ల కిందట సిబ్బంది, ఉద్యోగుల శాలరీ అకౌంట్స్‌ను యూబీఐకి మార్చామని, దీని ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉందని సజ్జనార్ చెప్పారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఈ ఉచిత ప్రమాద బీమా ఆసరాగా నిలుస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు.
యూబీఐ ఉచిత ప్రమాద బీమాపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ ఉందో.. లేదో చెక్ చేసుకోవాలని ఈ సందర్భంగా సజ్జనార్ ఉద్యోగులకు సూచించారు. ప్రతి ఒక్కరూ రూపే సెలక్ట్ కార్డును తీసుకుని, దానితో లావాదేవీలు చేసుకోవాలని, అప్పుడే రూ.12 లక్షల ప్రమాద బీమాను పొందగలుగుతారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications