ఆర్టీసీ ఛార్జీల పెంపు పై క్లారిటీ - కొత్త ధరలు ఇలా : సజ్జనార్ ఏం చెప్పారు...!!
ఆర్టీసీ ఛార్జీల పెంపు దాదాపు ఖాయమైంది. దీని పైన కొంత కాలంగా చర్చ కొనసాగుతోంది. ఇదే అంశం పైన రవాణా శాఖా మంత్రి...ఆర్టీసీ ఛైర్మన్ సైతం అధికారులతో సమావేశమై ప్రతిపాదనలు సిద్దం చేసారు. అయితే, అధికారికంగా ముఖ్యమంత్రి ఆమోదం పొందాల్సి ఉండటంతో పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు మరోసారి అదే అంశం పైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. కరోనా ప్రభావం తెలంగాణ ఆర్టీసీ పైన పెను భారం చూపించింది. డీజిల్ ధరలు పెరగటం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

టిక్కెట్ ధరలు పెంచక తప్పదు
డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని.. గడిచిన 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 1న 20 పైసల మేర చార్జీలు పెంచామని సజ్జనార్ గుర్తు చేసారు. చార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని.. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయామని వివరించారు. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సజ్జనార్.. 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని తెలిపారు. ఇక, గతంలో లీటర్ డీజిల్ రూ. 68.29 ఉంటే.. అది ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయిందని.. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏకంగా రూ. 480 కోట్ల నష్టం వాటిల్లిందని.. రూ.1,440 కోట్లు ఈ సంవత్సరం నష్టాలు ఉన్నాయని సజ్జనార్ చెప్పుకొచ్చారు.

తాజా ప్రతిపాదనలు ఇలా..
తాజా ప్రతిపాదనల ప్రకారం 25 పైసలు పల్లె వెలుగుకు, 30 పైసలు ఎక్స్ ప్రెస్‌లకు, ఇతర సర్వీసులకు పెంచాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీకి రోజుకు 14 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. చార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 525 కొత్త బస్సులు కొనుగోలు చేశాం... ఆర్టీసీలో అనేక మార్పులు తీసుకు వచ్చామని వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఆమోదం పొందగానే...
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్త తరహా నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా సంస్థ మనుగడతో పాటుగా సిబ్బందిలో భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఛార్జీలు పెంచటం మినహా ఆర్టీసీకి ప్రత్యామ్నాయం కనిపించటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక, ఇప్పుడు ఆర్టీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన ఆమోదించిన తరువాత కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications