కొండగట్టు అంజన్న భక్తులకు టీటీడీ శుభవార్త!!
కొండగట్టు అంజన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొండగట్టు అంజన్న భక్తుల కల త్వరలో నెరవేరనుంది. భక్తుల కోరిక మేరకు వంద గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థల పరిశీలన నిర్వహించారు. కొండగట్టు అంజన్న భక్తుల గదుల కోసం కావలసిన స్థలాన్ని పరిశీలించారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి భారీగా భక్తులు
దాదాపు 400 ఏళ్ల క్రితం కొండగట్టు మీద ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. కొండగట్టు మీద ఆంజనేయుడు స్వయంగా వెలిశాడని, 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయస్వామి కనిపించినట్టు చెబుతారు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఒక్క హనుమాన్ జయంతి నాడే 2 లక్షల మంది కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు.

100 గదుల నిర్మాణానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్
అయితే ఆలయానికి వస్తున్న వారికోసం బస చేసేందుకు ఎటువంటి గదులు అక్కడ లేకపోవడంతో టిటిడి కి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద గదుల నిర్మాణానికి భక్తులు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ మేరకు టీటీడీ 100 గదుల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థల పరిశీలన చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఇస్తామని చెప్పి అంజన్న భక్తులను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు.
కొండగట్టు గిరి ప్రదిక్షణకు రూట్ మ్యాప్
పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఎనలేని భక్తి ఉందని తెలిపారు. త్వరలోనే వంద గదుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అలాగే కొండగట్టు గిరి ప్రదిక్షణకు రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ స్థల పరిశీలనలో టీటీడీ నుండి డిఈ పివి నాగరాజు, ఏఈ జే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కలను టీటీడీ నెరవేరుస్తుంది.












Click it and Unblock the Notifications