యూరియా కొరత పాపం వారిదే: మంత్రి తుమ్మల
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేకపోతే సాగు కష్టమని, దిగుబడి తగ్గుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం అనేక పాట్లు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రోడ్లపై బారులు తీస్తున్నారు. అయితే యూరియా కొరత విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలో నిర్వాహకులతో అన్నదాతలు ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. యూరియా కోసం ఉన్న రైతులకు యూరియా ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చిన రైతులకు యూరియా ఇచ్చారని అధికారుల తీరు పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాట్లు వేసి నెలలు గడుస్తున్నా యూరియా దొరక్కపోవడంతో సాగు చేసిన పంట ఎదుగుదలకు రాకుండా అక్కడే నిలిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియాను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శించిందని అందువల్లనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. దాని ప్రభావం తెలంగాణపైనా పడిందని అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జులై, ఆగస్టులో రావాల్సిన యూరియా ఇంకా పూర్తిగా రాలేదన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి నడ్డాకు అనేకసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు ఏర్పడ్డాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ నెలాఖరు కల్లా 2.8 లక్షల టన్నుల యూరియా కోరుతున్నట్లు తెలిపారు.

అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేత, వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ లేకుండా చేయాలని కోరబోతున్నట్లు తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలకు సంబంధించిన పరిహారం, గతేడాది ప్రకటించిన పంట, ఆస్తి నష్టం పరిహారం విషయాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతిపై సుంకాలు 40 శాతానికి పెంచాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications