నేడు రెండు గంటలపాటు టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్: ఎందుకంటే?
హైదరాబాద్: ఆగస్టు 5న అంటే శనివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు గంటలపాటు ఆర్టీసీ సేవల బంద్‌కు మజ్దూర్ యూనియన్(టీఎంయూ) పిలుపునిచ్చింది. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల సేవలు నిలిచిపోనున్నాయి. ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు ఆర్టీసీ కార్మికులు.
గవర్నర్.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరుతూ టీఎంయూ నిరసన ప్రదర్శన చేపట్టనుంది. శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలని టీఎంయూ కోరింది. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద నిరసన చేపట్టనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆర్టీసీలో ఉన్న 43,373 మంది కుటుంబాలలో కేసీఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం నింపేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య అని తెలిపారు. గవర్నర్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని థామస్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీ బిల్లు పెండింగ్‌పై రాజ్‌భవన్ వివరణ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్‌భవన్ పెండింగ్ ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకనటలో వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వని క్రమంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 2వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్‌కు బిల్లు చేరిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications