అందుకే లాక్‌డౌన్ పొడగింపు: కేసీఆర్, తెలంగాణలో మరో 2 మరణాలు, 28 కొత్త కేసులు, 513కి చేరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు(ఆదివారం) కూడా గణనీయంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలు, పంటల కొనుగోళ్లు, పేదలకు సాయం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం ఒక్క రోజే 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

అందుకే లాక్‌డౌన్ పొడగింపు..
రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఉన్నందునే లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకుని ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా సామాజిక దూరం పాటించాలన్నారు.

ఏ మాత్రం అనుమానం వచ్చినా..
ఎవరికి అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. కరోనావైరస్ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదని.. ఆ నిర్ణయాలను ప్రజలు తూ.చ తప్పకుండా పాటిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు.

ప్రజలు మరింత జాగ్రత్తగా.. వారికి పరీక్షలు ముమ్మరం..
కరోనా వ్యాప్తి జరుగుతుందనే వాస్తవం గ్రహించి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి వారికి కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించి పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

మరో రెండు మరణాలు.. 531కి పాజిటివ్ కేసులు
కాగా, తెలంగాణలో ఆదివారం ఒక్క రోజే 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 531కి చేరింది. ఆదివారం మరో ఇద్దరు మృతి చెందారని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో మరణాల సంఖ్య 16కు చేరింది. ఇక ఆదివారం మరో ఏడుగురిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 103కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 412 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో అన్ని గ్రూపుల రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. నెలలు నిండిన మహిళల ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications