ప్రాణం తీసిన వేగం: హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పైనుంచి ఎగిరిపడి యువతి మృతి
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతూ హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి ఓ యువతి మృతి చెందింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కోల్‌కతాకు చెందిన స్వీటి పాండే(22) స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్టీయూ నుంచి ఐకియా వైపు బైక్‌పై బయల్దేరారు.
రాయన్ ల్యుకే అతివేగంగా బైక్ నడుపుతూ హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై గోడను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై కూర్చున్న స్వీటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. గోడను ఢీకొనడంతో రాయన్ ల్యుకేకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు.

అయితే, చికిత్స పొందుతూ స్వీటి పాండే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే యువతి ప్రాణం తీసింది. హైదరాబాద్ నగరంలో యువత ఎక్కువగా వేగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతూ ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని సూచనలు చేసినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో విద్యుత్ పోల్‌పై రిపేర్ వర్క్ చేస్తుండగా.. ఉన్నట్లుండి కరెంటు సరఫరా కావడంతో రామావత్ హరి(30) అనే యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. అంబోత్ మోహన్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ మోహన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
రామావత్ హరి, మోహన్ సొంతూరు మంచాల మండలంలోని చెన్నారెడ్డి గూడా గ్రామం. కాంట్రాక్టర్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే హరి చనిపోయాడని.. అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications